బెంగళూరులో భారీ వర్షానికి కుప్పకూలిన గోడ.. కేరళ టూరిస్టులు సహా ఏడుగురి మృతి

  • భారీ వర్షానికి కూలిన వందేళ్ల నాటి పాత గోడ  
  • ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
  • ప్రమాదంపై విచారణకు ఆదేశం
  • మృతుల కుటుంబాలకు పరిహారం
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షానికి పాత ప్రహరీ కూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో కేరళకు చెందిన ఇద్దరు టూరిస్టులు, ఓ చిన్నారి, నలుగురు వీధి వ్యాపారులు ఉన్నారు. ఈ ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది జరగకూడని విషాదమని ఆవేదన వ్యక్తంచేశారు.

బుధవారం రాత్రి ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే శివకుమార్.. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న బౌరింగ్ ఆసుపత్రిని సందర్శించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళకు చెందిన 56 మంది పర్యటన కోసం బెంగళూరు వచ్చారని, వారు కమర్షియల్ స్ట్రీట్‌లో షాపింగ్ చేస్తుండగా వర్షం మొదలైందని తెలిపారు. హెచ్చరికలు ఉన్నప్పటికీ, కొందరు ఆ పాత గోడ కింద తలదాచుకోగా అది ఒక్కసారిగా కూలిపోయిందని వివరించారు.

ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని శివకుమార్ అన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారని తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. కూలిన గోడ వందేళ్లకు పైగా పాతదని, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని పేర్కొన్నారు.

భారీ వర్షాల కారణంగా నగర వ్యాప్తంగా వందకు పైగా చెట్లు కూలిపోయాయని, ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు శివకుమార్ వెల్లడించారు. సురక్షితం కాని ప్రాంతాల్లో వీధి వ్యాపారులను అనుమతించవద్దని కూడా సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Karnataka
Bengaluru
Wall Collapse
Kerala Tourists
DK Shivakumar
Siddharamaiah

More Telugu News